Indian News

కరోనా భయం... వైద్యానికి నిరాకరించిన డాక్టర్లు ...

Source: , Posted On:   25 April 2021

కరోనా భయం... వైద్యానికి నిరాకరించిన డాక్టర్లు, హాస్పిటల్ బయటే మహిళ మృతి

ఏలూరు: దేశవ్యాప్తంగానే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా సెకండ్ వేవ్ భయానక పరిస్థితులను సృష్టిస్తున్నాయి. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నీరసించి, సొమ్మసిల్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జయలక్ష్మి అనే మహిళను కుటుంబసభ్యులు వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే కరోనా కారణంగా ఆమెకు వైద్యం చేయడానికి వైద్యులు నిరాకరించారు. కోవిడ్ రిపోర్ట్ ఉంటే గానీ వైద్యం చేయలేమని డాక్టర్లు అనడంతో హాస్పిటల్ బయటే ఎదురుచూస్తూ జయలక్ష్మి ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.  

ఇదిలావుంటే ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. నిన్న(శనివారం) ఏపి వైద్యారోగ్య ప్రకటన ప్రకారం గత 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పదకొండు వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 10,20,926కి చేరింది. ఒక్కరోజు కరోనా కారణంగా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 7,616కి చేరుకుంది.

read more  పట్టించుకోని బంధువులు... విజయవాడ జీజీహెచ్‌ మార్చురీలో గుట్టగుట్టలుగా శవాలు

24 గంటల్లో తూర్పుగోదావరి 6, నెల్లూరు 6, అనంతపురం 4, చిత్తూరు 4, శ్రీకాకుళం 3, పశ్చిమ గోదావరి 3, గుంటూరు 2, కృష్ణ 2, కర్నూలు 2, విశాఖపట్నం 2, విజయనగరం 2, ప్రకాశం జిల్లాలో ఒక్కరు మరణించారు.

4,421 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి రాష్ట్రంలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 9,31,839కి చేరింది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల సంఖ్య 81,471కి చేరుకున్నాయి.

 24 గంటల వ్యవధిలో 50,972 మంది శాంపిల్స్ పరీక్షించగా.. ఏపీలో ఇప్పటి వరకు కరోనా నిర్థారణా పరీక్షల సంఖ్య 1,59,31,722కి చేరుకుంది. ఒక్కరోజు అనంతపురం 1066, చిత్తూరు 1306, తూర్పుగోదావరి 909, గుంటూరు 1581, కడప 549, కృష్ణా 631, కర్నూలు 820, నెల్లూరు 902, ప్రకాశం 462, శ్రీకాకుళం 1641, విశాఖపట్నం 947, విజయనగరం 592, పశ్చిమగోదావరిలలో 292 చొప్పున కేసులు నమోదయ్యాయి.  
 

Last Updated Apr 25, 2021, 11:31 AM IST

 

Back